మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట ప్రాంతంలో చిరుతపులి సంచారం భయాందోళనకు గురిచేస్తోంది. గడచిన నాలుగు రోజుల క్రితం నుంచి వీరన్నపేట సక్కని రాయి గుట్టపై చిరుత సంచరిస్తోంది. నివాస ప్రాంతాలకు సమీపంలోనే చిరుత సంచరించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
ఐదు రోజుల క్రితం వీరన్నపేట HN ఫంక్షన్ హాల్ కు సమీపంలో చిరుత మొదట కనిపించింది. అనంతరం అక్కడి నుంచి పక్కనే ఉన్న సక్కని రాయి గుట్ట వైపు వెళ్ళిపోయింది. మొదటిరోజు చిరుత పులి కనిపించడంతో స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే మరునాడు ఉదయం సక్కని రాయి గుట్టపై ఉన్న బండ రాళ్ళ మీద చిరుత మరోసారి స్థానికులకు దర్శనమిచ్చింది. గుట్టకు అనుకోని నివాస ప్రాంతాల ప్రజలు చిరుత దృశ్యాలను తమ సెల్ ఫోన్ లో బంధించి మరోసారి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ సిబ్బంది గుట్టపైకి వెళ్ళి చిరుత సంచారానికి సంబంధించిన ఆధారాలు సేకరించారు. చిరుత సంచారాన్ని ధృవీకరించుకున్నాక దానిని బంధించేందుకు ప్రయత్నాలు చేశారు.
అయితే అదే రోజు సాయంత్రం మరోసారి గుట్టపై ఉన్న బండ రాళ్ళ ను దూకుతూ చిరుత పులి కనిపించింది. ఇక గడచిన నాలుగు రోజులుగా గుట్ట పైనే చిరుత సంచరిస్తోందని స్థానికులు చెబుతున్నారు. గుట్ట నివాస ప్రాంతాలకు అనుకోని ఉండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆహారం, నీరు కోసం ఏ సమయంలో ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందేమోనని వణికిపోతున్నారు. ఇప్పటికే పిల్లలు, వృద్ధులతో పాటు మిగతా అందరూ అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఇక వీరన్నపేట ప్రాంతంలో చిరుతపులి సంచారంపై అటవీ శాఖ అప్రమత్తమైంది. గడచిన నాలుగు రోజుల క్రితం నుంచి వీరన్నపేట సక్కని రాయి గుట్టపై చిరుత సంచరిస్తోందన్న విషయం తెలియడంతో చిరుతను బంధించేందుకు చర్యలు చేపట్టారు. గుట్టపై చిరుత సంచారానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సేకరించారు. అనంతరం చిరుతను బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మేకపిల్లను ఎరగా ప్రత్యేకంగా బోన్ ఏర్పాటు చేశారు. అలాగే సోలార్ ఆధారిత కెమెరాలు బోన్ కు అమర్చారు. అయితే నాలుగో రోజు అటవీ సిబ్బంది ట్రాప్ కు చిరుత చిక్కలేదు. ఇదే గుట్టపై మరో ప్రాంతంలో రాత్రి చిరుతపులి కనిపించింది. కెమెరాలు ఏర్పాటు చేసి… చిరుతపులి ని ట్రాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వీలైంత త్వరగా చిరుతపులి బంధించేందుకు చర్యలు చేపడుతున్నామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..