అక్క బ్రతికుండగానే చనిపోయిందని నకిలీ పత్రాలు స్రుష్టించి తమ్ముడు ఆమె ఆస్థిని కాజేసిన ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. వివారాల్లోకి వెళితే.. తెనాలి మండలం బుర్రిపాలెంకు చెందిన గాజుల బసవ పూర్ణ కుమారి పేరు మీద రెండెకరాల మాగాణి, 17 సెంట్ల ఇంటి స్థలం ఉంది. పూర్ణ కుమారి భర్త గతంలోనే చనిపోయారు. ఆమె కుమార్తె కుటుంబంతో చక్రాయపాలెంలో ఉంటుంది. అయితే జూన్ నెలలో తన భూమికి సంబంధించిన సమాచారం కోసం రెవిన్యూ సిబ్బందిని పూర్ణ కుమారి సంప్రదించింది. అన్నదాత సుఖీభవకు వస్తుందో రాదో అన్న సమాచారాన్ని చెక్ చేసుకునే క్రమంలో భాగంగా సమాచారం అడిగింది. అయితే ఆమె పేరు మీద భూమి లేదని రెవిన్యూ సిబ్బంది తెలిపారు. దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. పోలీసులు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
పూర్ణ కుమారి పేరు మీదన్న భూమి, ఇంటి స్థలాన్ని ఆమె తమ్ముడు కోలపల్లి సత్యన్నారాయణ, అతని కుమారుడు నరేష్ పేరు మీద మొదట మార్చుకున్నట్లు తేలింది. పూర్తి కుమారి చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికేట్ స్రుష్టించిన నరేష్ ఆమె ఆస్తికి తామే వారసులమంటూ రెవిన్యూ అధికారునలు సంప్రదించారు. అక్కడ నుండి కథ మొత్తం నడిపిన నరేష్ భూమిని మొదట వారి మీదకు బదలాయించుకున్నాడు. ఆ తర్వాత ఆ భూమిని యాభై ఐదు లక్షలకు వివిధ రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారా హైదరాబాద్, దుగ్గిరాల, తెనాలికి చెందిన వారికి విక్రయించారు. నరేష్ ను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించడంతోనే ఈ మోసం బయటపడింది. అయితే నరేష్ కు సహకరించిన డాక్యుమెంట్ రైటర్ తిరుపతి మరియదాస్, మీ సేవా కేంద్రం నిర్వాహకుడు శివన్నారాయణలను పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే నరేష్ గతంలోనూ అతని పిన్ని కాళేశ్వరి పేరిట నకిలీ ఆధార్ కార్డ్, ఓటర్ కార్డు స్రుష్టించి ఆమె పేరు మీద ఉన్న మూడు ఎకరాల భూమిని విక్రయించినట్లు పిఎస్ లో కేసు నమోదైంది. నరేష్ కు సహకరిస్తున్న డాక్యుమెంట్ రైటర్ మరియదాసు పై రేపల్లే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 18 లక్షల రూపాయల డిడిలను సొంతానికి వాడుకున్న కేసు ఉంది. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వీరంతా ఒక ముఠాగా ఏర్పడి అక్రమాలకు, మోసాలను పాల్పడుతున్న తెనాలి డిఎస్పీ జనార్ధనరావు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.