కళ్యాణ తాంబూలం నష్టాల నుండి వై. హరికృష్ణను ఆదుకోవాలని ఎన్టీఆర్ కోరగా, బాలకృష్ణ ఇన్స్పెక్టర్ ప్రతాప్ మూవీని ఒప్పుకున్నారట. స్వల్ప పారితోషికంతో, ఆర్థిక క్రమశిక్షణతో సినిమా తీయమని బాలకృష్ణ సూచించారట. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో, బాలకృష్ణ అండదండలతో ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఘన విజయం సాధించి, హరికృష్ణకు లాభాలు తెచ్చింది. హరికృష్ణ సినీరంగంలో ఒక చిరు ఉద్యోగిగా ప్రవేశించి, పంపిణీదారుడిగా, నిర్మాతగా మారి ఎన్నో ఉత్తమ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఐదు దశాబ్దాల తన సినీ ప్రస్థానంలో నిజాయితీకి, నిరాడంబర జీవన విధానానికి, నిర్మాతల ఆత్మ గౌరవానికి హరికృష్ణ ప్రతీకగా నిలిచారు. విజయశాంతి కథానాయికగా నటించిన వందేమాతరం చిత్రంతో నిర్మాతగా మారిన హరికృష్ణ, నటభూషణ శోభన్ బాబు హీరోగా రెండు చిత్రాలు నిర్మించారు. వాటిలో కళ్యాణ తాంబూలం ఒకటి. విశిష్ట దర్శకుడు బాపు రూపొందించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, విజయశాంతి జంటగా నటించారు. నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని ఊటీలో నిర్మించారు హరికృష్ణ. జిల్లాల వారీ వ్యాపారం అనుకున్న రీతిలో జరగకపోవడంతో, ఆయన రిస్క్ చేసి తనే సొంతంగా విడుదల చేశారు. దీనివల్ల ఆయన 40 లక్షలు పోగొట్టుకున్నారు.
హరికృష్ణ అంటే నవరత్న ఎన్టీఆర్ కు ప్రత్యేక అభిమానం. కళ్యాణ తాంబూలం సినిమా తీసి ఆయన ఆర్థికంగా దెబ్బతిన్నారన్న విషయం నిర్మాత దేవివరప్రసాద్ ద్వారా తెలుసుకున్న ఎన్టీఆర్ వెంటనే హరికృష్ణకు ఒక సినిమా చేయమని తన తనయుడు బాలకృష్ణకు చెప్పారు. ఆ సమయంలో బాలకృష్ణ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. రెండేళ్ల వరకు ఎవరికీ డేట్స్ ఇవ్వలేని పరిస్థితి అయినా, తండ్రి మాట కాదనలేకపోయారు. పైగా బాలకృష్ణ హిట్ చిత్రాలను హరికృష్ణ పంపిణీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే హరికృష్ణను పిలిచి, “అంకుల్ మీ గురించి నాకు బాగా తెలుసు. నాన్నగారు కూడా చెప్పారు. మనం సినిమా చేస్తున్నాం. ఇప్పుడు నేను సినిమాకు 20 లక్షలు తీసుకుంటున్నాను. కానీ మీరు 10 లక్షలు ఇవ్వండి చాలు. అందులో కూడా ఫార్మాలిటీగా ఓ లక్ష రూపాయలు అడ్వాన్స్ గా ఇవ్వండి. మిగిలిన తొమ్మిది లక్షలు సినిమా బిజినెస్ అయ్యాక ఇవ్వండి. అలాగే షూటింగ్లో అనవసరపు ఖర్చులు, ఆర్భాటాలు వద్దు. కథను నమ్ముకుని సినిమా తీసే నిర్మాత మీరు. మీ పద్ధతిలోనే ఈ సినిమా కూడా తీయండి” అని చెప్పారు బాలకృష్ణ.
ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అన్న చర్చ వచ్చినప్పుడు అందరూ కోదండరామిరెడ్డి పేరు సూచించారు. బాలయ్య, కోదండరామిరెడ్డిలది హిట్ కాంబినేషన్ కావడం వల్ల బిజినెస్ బాగా అవుతుంది కనుక ఆయన్ని దర్శకుడిగా తీసుకుంటే బాగుంటుందని చాలామంది హరికృష్ణకు చెప్పారు. అయితే అప్పటికే ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రెండు సినిమాలు తీశారు హరికృష్ణ. వారిద్దరి మధ్య మంచి అవగాహన కూడా ఉంది. పైగా ఒక పెద్ద హీరోతో సినిమా తీస్తే ముత్యాల సుబ్బయ్య కెరీర్ కు బాగా హెల్ప్ అవుతుందని ఆయన పేరు బాలకృష్ణకు సూచించారు హరికృష్ణ. బాలకృష్ణ కూడా సరే అన్నారు. అలా ఇన్స్పెక్టర్ ప్రతాప్ చిత్రం పట్టాలెక్కింది. చిత్రంలో హీరోయిన్ గా విజయశాంతిని ఎంపిక చేశారు. కైకాల సత్యనారాయణ, జగ్గయ్య, గొల్లపూడి, గిరిబాబు, శ్రీవిద్య వంటి ప్రముఖ నటీనటులందరినీ ఈ సినిమా కోసం ఎంపిక చేశారు.
ఇన్స్పెక్టర్ ప్రతాప్ చిత్రానికి బాలకృష్ణ అందించిన సహకారం అంతా ఇంతా కాదు. ప్రతిరోజూ ఇంటి దగ్గర నుంచి యూనిట్లో ముఖ్యమైన వారందరికీ సరిపోయే భోజనాలు తెప్పించి అందరికీ తనే స్వయంగా వడ్డించేవారు. ఒకసారి 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతూ కూడా షూటింగ్ లో పాల్గొన్నారు బాలకృష్ణ. 1988 సంక్రాంతి బరిలో ఇన్స్పెక్టర్ ప్రతాప్, మంచి దొంగ చిత్రాలు పోటాపోటీగా నిలిచాయి. జనవరి 14న మంచి దొంగ చిత్రం విడుదల అయితే జనవరి 15న ఇన్స్పెక్టర్ ప్రతాప్ చిత్రం రిలీజ్ అయింది. రెండు చిత్రాలు ఘనవిజయం సాధించడం విశేషం. ఇన్స్పెక్టర్ ప్రతాప్ చిత్రంతో నిర్మాత హరికృష్ణకు 29 లక్షల లాభం వచ్చింది. ఆ డబ్బుతో ఆయన కళ్యాణ తాంబూలం అప్పులు తీర్చేశారు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ చిత్రం ఘనవిజయం సాధించినా 100 రోజుల వేడుక నిర్వహించలేకపోయారు. కారణమేమిటంటే ఆ ఫంక్షన్ చేయాలంటే మళ్లీ కొత్తగా అప్పు చేయాలి. ఇలా అప్పు చేసే పద్ధతికి ఆయన వ్యతిరేకం. అందుకే ఫంక్షన్ చేయలేదు. హరికృష్ణ విషయం బాలకృష్ణకు తెలుసు కనుక ఆయన కూడా ఈ విషయంలో ఒత్తిడి చేయలేదు.