నల్లగొండ నేతన్నలకు అవార్డుల పంట.. జిల్లా వ్యాప్తంగా ఎంతమందికి వచ్చాయె తెలిస్తే!

నల్లగొండ నేతన్నలకు అవార్డుల పంట.. జిల్లా వ్యాప్తంగా ఎంతమందికి వచ్చాయె తెలిస్తే!


ప్రపంచ ప్రసిద్ధి చెందిన పోచంపల్లి చేనేత పట్టుచీరలు నల్లగొండ జిల్లా చేనేత కళాకారుల కళా నైపుణ్యానికి ప్రత్యేకగా నిలుస్తున్నాయి. ఇక్కడ కార్మికులు చేనేత కళా ప్రపంచంలో ఎన్నో అద్భుతాలను సృష్టించారు. జీవ వైవిధ్యం ప్రతిబింబించేలా మడ్తాస్ ఇక్కత్ చీర, ప్రకృతి అందాలతో పరవశించి నృత్యం చేస్తున్న అంబారీ, నెమలి బొమ్మలతో వినూత్న డిజైన్లతో మడ్తాస్ ఇక్కత్ చీరను నేసిన పోచంపల్లికి చెందిన చేనేత కళాకారులు మంగళపల్లి శ్రీహరి ఉత్తమ వీవర్ గా కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుకు ఎంపికయ్యారు. ఏడాది పాటు కష్టపడి 234 కొయ్యలు, రిపిట్ లేకుండా ఆరు వరుసల్లో వైట్ బేస్ చీరను రూపొందించారు. డిజైన్లును రూపొందించడం, వాటిని గ్రాఫ్పై గీయడం, అందుకనుగుణంగా చిటికి కట్టడం, మగ్గం నేయడం కోసం మూడు నెలలు కష్టపడ్డాడు. చీరలో తెలంగాణ పండుగను ప్రతిబించేలా బతుకమ్మ, పద్మాల డిజైన్లను వేశారు. డిజైన్లు స్పష్టంగా కన్పించేలా వైట్ బేస్ చీరలో ఆనంద, బ్లాక్, మెరూన్, పసుపు, ఆకుపచ్చ రంగులను వినియోగించారు. తాను పడిన కష్టానికి తగిన గుర్తింపు వచ్చిందని శ్రీహరి ఆనందం వ్యక్తం చేశారు.

పుట్టపాకకు అవార్డుల పంట.. ప్రకృతి రంగులతో అందమైన వస్త్రం..

చేనేత రంగంలో పుట్టపాక గ్రామానికి ప్రత్యేక స్థానం. ఇక్కడి కార్మికులు నేసిన పట్టువస్త్రాలకు అంతర్జాతీయ, జాతీయ,రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు వరించాయి. కేంద్రప్రభుత్వం ప్రకటించే ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డులను సైతం చేనేతరంగం నుంచి మొదటిసారి ఈ గ్రామానికి చెందిన కార్మికులకు దక్కాయి. ప్రకృతి రంగులతో అందమైన డబుల్ ఇక్కత్ చీరలను పుట్టపాకకు చెందిన గూడ పవన్ ఆవిష్కరించారు. బంతి పూలు, దానిమ్మ పండ్లు, వేర్లు వనమూలికలతో తయారు చేసిన సహజసిద్ధ రంగులను మల్బరి పట్టుదారానికి తేలియా రూమల్ చీరను తయారు చేశారు.16 ఆకృతులు అద్ది మడతలు పడకుండా చీరను రూపొందించారు. ఈ చీర తయారు చేయడానికి పవన్ ఆరు నెలల పాటు
శ్రమించారు. ఈ చీర ఖరీదు రూ.75 వేల వరకు ఉంటుందని తెలిపారు. ఎనిమిది సంవత్సరాలుగా చేనేతలో విభిన్న రకాలుగా శ్రమిస్తూ ఎన్నో నూతన నమూనాలను తయారు చేయడంతో పాటు తాజాగా ఈ వస్త్రాన్ని తయారు చేసి రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. కాగా పవన్ ఇదే చీరను తయారు చేసినందుకు జాతీయ చేనేత అవార్డుకు ఎంపికయ్యారు.

సాధారణ చీరలకు భిన్నంగా త్రీడీ చీరలు

మార్కెట్ లో తయారయ్యే సాధారణ చీరలకు భిన్నంగా చీరలను సామల భాస్కర్ రూపొందించాడు. భాస్కర్ తన 33 సంవత్సరాల చేనేత అనుభవంతో త్రీడీ ఎఫెక్ట్ ఉండేలా కొత్త డిజైన్ తో చీరను రూపొందించారు. సాధారణంగా ఒక చీరకు 30 మెట్లు ఉంటే భాస్కర్ 1450 మెట్లతో నెమలి దేవత ఆకృతులతో గ్రాఫిక్ డిజైన్ రూపొందించారు. నిలువు, 4 అచ్చెలతో ప్యూర్ సిల్క్ చీరను 10 నెలల్లో తయారు చేశారు. అంతేకాకుండా టస్పారు ఎల్లో, గ్రీన్, బ్రౌన్, రాయల్ బ్లూ, రెడ్ బ్లాక్ లాంటి ఏడు రంగులను వినియోగించాడు. దీంతో భాస్కర్ కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు ఎంపిక అయ్యాడు. ప్రత్యేక రూపకల్పనతో పుట్టపాకకు చెందిన కొలను శంకర్ సిల్క్, లెనిన్ కాటన్ తో డబుల్ ఇక్కత్ పద్ధతిలో రాజ్కోట్ ప్రత్యేక చీరలను రూపొందించారు. ఇందులో కలర్ డిజైన్ ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. విభిన్న పద్ధతులతో తయారుచేసిన ఈ చీరను ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు ఎంపిక చేసింది.

చేనేతలో విశేష ప్రతిభ కనబర్చిన ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన 13 మంది చేనేత కళాకారులను కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులకు ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పుసర్కరించుకుని హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించే కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతులమీదుగా వారు రూ.25వేల నగదు పురస్కారం, మెమొంటో, ప్రశంసా పత్రం అందుకోనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *